Amma : ప్రతిరోజూ మనం మదర్స డే జరుపుకోవాలి
"పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మా" అని చంద్రబోసు...
"ఎవరు రాయగలరూ, అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం... ఎవరు పాడగలరూ, అమ్మా అను రాగం కన్న తీయని రాగం అని సిరివెన్నెల రాశారు! వీళ్లు మనకు తెలిసిన వారు, తెలియకుండా రాశినవారు ఎందరో ఉన్నారు! అమ్మ గురించి రాయాలంటే కవే కానక్కర్లేదు,
అమ్మ గురించి చెప్పాలంటే పెద్ద వక్తే అవనవసరం లేదు! ఎవరు రాసినా, ఎన్ని రాసినా... అమ్మ గొప్పతనం మీద ఎన్ని పాటలు, ఎన్ని గేయాలు ఇంకెన్నో కథలో మనకు తెలుసు! మన ఇతిహాసాలు, చరిత్రలు చదివినా ఒక కుంతి, ఒక సీత, ఒక యశోద, కౌసల్య, జిజాబాయ్ అలా ఎంత మంది అమ్మలు తమ వాత్సల్యం తో, ప్రేమతో, అనురాగంతో, అచంచల ధైర్యం తో మహామహులను మనకి అందజేశారు. అమ్మ కోరుకునేది గీతాలు, గేయాలు, కవితలు, మాటలేనా... కాదు, ఆప్యాయతతో కూడిన అమ్మా అనే పిలుపు!
అమ్మకు ఇచ్చే గౌరవం, ప్రేమా, ఆదరణ! అమ్మకు ఎన్ని నిర్వచనాలో... ఈ భూమి, నీరు, ప్రకృతి కూడా అమ్మ స్వరూపాలే. కాలాలు మారినా తల్లి ప్రేమ తరగలేదు!
యుగాలు మారినా తల్లి మమకారం మారలేదు!
కాని, ఆ తల్లి గర్భంలో పుట్టిన ఎందరు ఆ అమ్మను గుర్తుపెట్టుకుంటున్నారు? రెక్కలు వచ్చి ఎగిరిపోయే పక్షులుగా,
ధనం మూలం ఇదం జగత్ గా మారిన ఎందరికి
అమ్మ ఋణం తిర్చాలన్న తలంపు ఉంది? అమ్మ ఏది కోరదు, ప్రేమ చేసినా, ఛీదరించుకున్నా, నడిరోడ్డున వదిలివేసినా తన బిడ్డ సుఖంగా ఉండాలని ముక్కోటి దేవతలను కోరుతుంది.
తన బిడ్డ ఎంత ఎత్తు ఎదిగినా లోలోన మురిసిపోతూ మెచ్చుకోదు... అమ్మ- దిష్టి తగులుతుందని! అమ్మ తిట్టినా, కసిరినా, అవి బిడ్డకు దీవెనలే.
అదే శ్రీరామ రక్ష! ఈ రోజు మనమందరమూ మదర్స్ డే జరుపుకుంటున్నాము.
మన మాతృమూర్తికి ఎన్నో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నాము.
మన గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకున్నా చలించని ప్రేమ అమ్మది.
మదర్స్ డే అన్నది తల్లికి మనం జరుపుకునే పండుగ రోజు!
నిజానికి, ప్రతిరోజూ మనం మదర్స డే జరుపుకోవాలి. ఎందుకంటే... ఏమి ఇచ్చి, ఎంత చేసి మనం అమ్మ ఋణం తీర్చుకోగలం?
తల్లిని ప్రేమించేవారికి వందనాలు,
తల్లిని ప్రేమించని వారికీ వందనాలు... ఎందుకంటే అలాంటి బిడ్డలను చూసినా అమ్మకు కోపం రాదుకాబట్టి! ఆ గౌరవం మీకు అమ్మవల్లే వచ్చింది... ఆమె నేర్పిన సంస్కారం వల్లే అబ్బింది! తల్లిని ప్రేమించండి... తల్లిని పూజించండి... తల్లే సర్వం,
తల్లే దైవం! మాతృదేవో భవ!
Post a Comment
Note: only a member of this blog may post a comment.